నీ గెలుపుని తమదిగా భావించి అహర్నిశలు కష్టించి పని చేసిన వారికి ఏం చేశావ్ . ప్రకాశ్‌రెడ్డీ.. అంటూ మాజీ మంత్రి పరిటాల సునీత ప్రశ్నించారు. సీకేపల్లి మండలంలోని ప్యాదిండి, చందమూరు, చిన్నపల్లి, హర్యాన్ చెరువు గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత ఎన్నికల సమయంలో ప్రకాశ్‌రెడ్డి విజయం కోసం గ్రామ స్థాయిలో ఉండే ఆ పార్టీ చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడి వరకూ కలిసి కట్టుగా పని చేసి ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే తన సోదరులు, అనుయాయుల ద్వారా దందాలు సాగించారని వివరించారు. తమ పార్టీ వారిని సైతం వదలక పోవడం దుర్మార్గమన్నారు. వారి ఆగడాలను భరించలేక ఎంతోమంది పార్టీకి దూరంగా ఉంటున్నారన్నారు. తెదేపా సీనియర్ నాయకుడు ఎల్ నారాయణచౌదరి, మండల కన్వీనర్ ముత్యాలరెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రంగయ్య, పార్టీ ఉపాధ్యక్షుడు ఓబుళేశ్, తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి రామసుబ్బమ్మ పాల్గొన్నారు. అంతకుముందు అనంతపురం క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కనగానపల్లి మండలం కేఎన్ పాళ్యం, కనగానపల్లి గ్రామాలకు చెందిన 40 కుటుంబాలు, చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన 17 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. రాప్తాడు నియోజకవర్గంలో తెదేపా విజయం తథ్యమని సునీత పేర్కొన్నారు.
source : eenadu.net
Discussion about this post