గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ, సమసమాజ నిర్మాణం, పేదరిక నిర్మూలనకు పునరంకితమవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అంబేడ్కర్ ఆదర్శాలు, ఆకాంక్షల ద్వారా మనం సాధించిన సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక పురోగతిని దేశ ప్రజలు సగర్వంగా గుర్తుచేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు ఎండీ షరీఫ్, టీడీ జనార్దన్, వర్ల రామయ్య, పీతల సుజాత తదితరులు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post