పాలకులు ఎవరైనా తన రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతి, మానవాభివృద్ధి సూచికలు, మౌలికవసతుల కల్పన వంటి రంగాల్లో అగ్రగామిగా నిలపాలని భావిస్తారు. జగన్ మాత్రం గత అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి, డ్రగ్స్‌లో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టారు. ఏ రాష్ట్రమైనా.. కేంద్రప్రభుత్వ శాఖలు విడుదల చేసే వివిధ రకాల ప్రగతి నివేదికల్లో, ఉద్యోగ, ఉపాధి కల్పనల్లో ముందువరుసలో ఉండాలని అనుకుంటుంది. కానీ జగన్ ఏపీని మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌లో ముందంజలో నిలిపారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ప్రతి మూలకూ వ్యాపించాయి. కానీ, అందులో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు పట్టుకుంటున్నది కనీసం రెండు శాతమైనా లేదు. ఆ మాత్రానికే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) తదితర విభాగాలు విడుదల చేసే నివేదికల్లో మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌లో ఏపీ మొదటిస్థానంలో ఉంటోంది.
డ్రగ్స్ పట్టుబడ్డ రాష్ట్రాల్లో ఏపీది అగ్రస్థానం
2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా పట్టుబడ్డ మాదకద్రవ్యాల్లో అత్యధిక శాతం ఆంధ్రప్రదేశ్‌లోనే లభించాయి. కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని డీఆర్‌ఐ అధికారులు దేశవ్యాప్తంగా 34,002.60 కిలోల మాదకద్రవ్యాల్ని స్వాధీనం చేసుకోగా.. అందులో సగం 18,267.84 (53%) ఏపీలోనే దొరికాయి. పట్టుకున్న వాటిలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు ఉన్నాయి.
ఏపీ తర్వాత త్రిపుర (10,104 కిలోలు), అస్సాం (3,633.08 కిలోలు), తెలంగాణ (1,012 కిలోలు), ఛత్తీస్‌గఢ్ (830 కిలోలు) తదితర రాష్ట్రాల్లో ఎక్కువ మొత్తాల్లో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి.
ఆ ఆర్థిక సంవత్సరంలో మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌కు పాల్పడి డీఆర్‌ఐ చేతిలో అరెస్టయినవారిలో అస్సాం (500 మంది) తర్వాత ఏపీ (90)లోనే ఎక్కువమంది ఉన్నారు. ‘స్మగ్లింగ్ ఆఫ్ ఇండియా నివేదిక- 2021-22’ ఈ విషయాల్ని బహిర్గతం చేసింది.
గంజాయి వినియోగంలోనూ అంతే..
గంజాయి విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్‌గా నిలిచింది. అత్యధికంగా గంజాయి పట్టుబడ్డ రాష్ట్రాల జాబితాలో 2019, 2021 సంవత్సరాల్లో మొదటిస్థానంలో, 2020లో రెండోస్థానంలో ఏపీ ఉంది. మాదకద్రవ్యాల నియంత్రణ కోసం పనిచేసే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) 2021లో దేశవ్యాప్తంగా 7,49,761 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా… అందులో అత్యధికంగా 2,00,588 కిలోలు (26.75%) ఆంధ్రప్రదేశ్‌లోనే పట్టుబడింది. 2020లో దేశవ్యాప్తంగా 5,81,644 కిలోల గంజాయి పట్టుకోగా.. అందులో 97,826 కిలోలు (16.81%), 2019లో దేశవ్యాప్తంగా 3,42,044.87 కిలోలు పట్టుకోగా అందులో 70,229.77 కిలోలు (20.53%) ఏపీలోనే స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రంలో గంజాయికి బానిసలైన వారు 4.64 లక్షల మంది ఉన్నారు. వారిలో 21వేల మంది 10-17 ఏళ్ల లోపు వారే. బాలల్లో గంజాయి వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ది 12వ స్థానం.
రాష్ట్రంలో 20.19 లక్షల మంది మాదకద్రవ్యాల వ్యసనపరులు ఉండగా.. వారిలో 15.70% బాలలే. రాష్ట్రంలో మొత్తం 3.17 లక్షల మంది బాలలు మత్తుపదార్థాలకు బానిసలుగా మారారు.
source : eenadu.net
Discussion about this post