ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు ఓట్లు అడిగే నైతిక అర్హత లేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి శంకర్‌నారాయణ అన్నారు. శనివారం ఉరవకొండ పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మోసం చేస్తూ, వారి సమస్యలు పట్టించుకోకుండా గత ఐదేళ్లూ చుట్టపుచూపుగా నియోజకవర్గానికి వచ్చి వెళ్లిన ఘనుడు పయ్యావుల కేశవ్ అన్నారు. మళ్లీ నేడు ఓట్ల కోసం ప్రజల దగ్గరికి వెళ్తూ మభ్యపెట్టడానికి యత్నిస్తున్నారన్నారు. ప్రజలే కేశవ్‌ను తరిమికొడతారని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమం, అభివృద్ధి జరిగిందన్నారు. జన హృదయాల్లో వైఎస్ జగన్ చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఉరవకొండలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటు అభ్యర్థి శంకర్‌నారాయణ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఎంతో ఆత్మీయంగా తమకు స్వాగతం పలుకుతున్నారన్నారు. సంక్షేమ పాలనకే మా మద్దతు అంటూ చెబుతున్నారన్నారు. వైఎస్ జగన్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఖాయమన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య మాట్లాడుతూ జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక ఎంపీ స్థానాన్ని వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుంటుందన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలోనే అన్ని వర్గాలకూ న్యాయం జరిగిందన్నారు. ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన్ లిఖిత, ఆర్టీసీ రీజినల్ చైర్‌పర్సన్ మాల్యవంతం మంజుల మాట్లాడుతూ కేశవ్‌కు బుద్ధి చెప్పడానికి ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఫ్యాన్ గాలికి టీడీపీ కొట్టుకుపోవడం ఖాయమ న్నారు.
source : sakshi.com
Discussion about this post