పంచాయతీల నిధులు లాగేసుకోడానికి జగన్ ప్రభుత్వ దొంగాట కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను భేఖాతరు చేస్తూ ఆర్థిక సంఘం నిధులను గంపగుత్తుగా వెనక్కి తీసుకునేలా వైకాపా సర్కార్ ప్రయత్నిస్తోంది. ఈసారి విద్యుత్తు పంపిణీ సంస్థలను (డిస్కం) రంగంలోకి దింపి విద్యుత్తు బకాయిలు చెల్లించాలని పంచాయతీలపై తీవ్రంగా ఒత్తిడి చేయిస్తోంది. పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.1,000 కోట్లను ఎలాగైనా తిరిగి తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. అనేక పోరాటాల ఫలితంగా పంచాయతీల ఖాతాల్లో వేసిన ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల్లో ముఖ్యమైన పనులు చేయిద్దామని భావిస్తున్న సర్పంచులకు తాజా పరిణామాలు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వ తీరుపై వారు మండిపడుతున్నారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన 14, 15 ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి ఇప్పటికే రూ.2,500 కోట్ల వరకు విద్యుత్తు ఛార్జీల బకాయిల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లించింది.
పంచాయతీ తీర్మానం లేకుండా, సర్పంచులకు సమాచారం కూడా ఇవ్వకుండా వాటి పీడీ ఖాతాల్లో నుంచి నిధులు మళ్లించారు. ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి పది శాతాన్నే పరిపాలన అవసరాలకు వెచ్చించాలన్న మార్గదర్శకాలను కూడా జగన్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. సగటున 24 నుంచి 90 శాతం వరకూ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల ఖాతాల్లోంచి విద్యుత్తు ఛార్జీల బకాయిల చెల్లింపుల కోసమని ఖాళీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సర్పంచులు తమ ఆందోళనలను దిల్లీ వరకు తీసుకెళ్లడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉపకార్యదర్శి గత ఏడాది సెప్టెంబరులో రాష్ట్రంలో పర్యటించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో జగన్ ప్రభుత్వం మెట్టు దిగొచ్చింది. 2022-23 సంవత్సరానికి కేంద్రం కేటాయించిన దాదాపు రూ.2 వేల కోట్ల ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి దాదాపు రూ.1,400 కోట్లు పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో గత ఆరు నెలల్లో జమ చేసింది.
source : eenadu.net
Discussion about this post