క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కుమ్ములాటలు చల్లారడం లేదు. టికెట్ ఆశించి భంగపడినవారు అక్కడి అభ్యర్థులకు సహకరించడానికి ససేమిరా అంటున్నారు. టికెట్ దక్కించుకున్నవారితో నేరుగా వాదులాటకు దిగుతున్నారు. కొందరు నాయకులు అభ్యర్థిత్వాల ఎంపికకు నిరసనగా రాజీనామా చేస్తుండగా… మరికొందరు ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
మరికొన్ని చోట్ల ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు. తమకు నచ్చని వ్యక్తులకు అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో వారిని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో పావులు కదుపుతున్నారు. జరుగుతున్న పరిణామాలు కూటమి నేతలకు శిరోభారంగా మారుతున్నాయి. పరిస్థితులు ఇలానే కొనసాగితే ఆయా అభ్యర్థులకు ఎదురుగాలి తప్పదని శ్రేణులు ఖరాకండీగా చెబుతున్నాయి. జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి.అక్కడ గత ఎన్నికల్లో ఓడిపోయిన శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)కు టికెట్ ఇవ్వడాన్ని మాజీమంత్రి నెట్టెం రఘురాం, బీఆర్కే చానల్ యజమాని, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. నియోజకవర్గంలో సుమారు 40 వేల ఓటుబ్యాంకు కలిగిన కమ్మ సామాజికవర్గానికి గడచిన నాలుగు పర్యాయాల నుంచి టికెట్ కేటాయించకుండా అవమానిస్తోందని ఆ సామాజికవర్గ నేతలు మండిపడుతున్నారు.
source : sakshi.com
Discussion about this post