గర్భిణులు, బాలింతల ఆరోగ్య రక్షణకు ఎంతో అవసరమైన అనుబంధ పోషకాహారాన్ని వారికి అందించడంలో వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. పోషకాహారాన్ని అందించడంలో జాప్యం ఏమాత్రం సహించరానిదంటూ అంగన్‌వాడీల సర్వీసులను అత్యవసర సేవల పరిధిలోకి తెచ్చి మరీ ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన జగన్ ప్రభుత్వం..పంపిణీ విషయానికి వచ్చేసరికి చేతులెత్తేస్తోంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన 4 జిల్లాల పరిధిలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్ల కింద అందించే పోషకాహారం జనవరి నెలకు సరఫరా చేయకపోయినా జగన్ ప్రభుత్వం మిన్నకుంది. కోర్టు కేసును బూచిగా చూపి గుత్తేదారు సరఫరాను నిలిపేసినా ప్రత్యామ్నాయంపై దృష్టి సారించలేదు.
పంపిణీకి అవకాశమున్నా…
సంపూర్ణ పోషణ కిట్లకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం ధరలు సవరించి టెండర్లను పిలిచింది. కొత్త ధరల ప్రకారం డిసెంబరు మాసం నుంచి ఈ నాలుగు జిల్లాలకు గుత్తేదారు పోషకాహారం సరఫరా చేస్తున్నారు. టెండరు ప్రక్రియలో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారంటూ మరో గుత్తేదారు కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం స్టేటస్‌కో ఇచ్చింది. తాను కోట్ చేసిన ధర తక్కువగా ఉండటంతో అదును కోసం ఎదురుచూస్తున్న సదరు గుత్తేదారు డిసెంబరు నెల పంపిణీ పూర్తికాగానే కోర్టులో కేసు ఉందంటూ సరఫరా నిలిపేశారు. ఆ గుత్తేదారే మరొకరిని పురమాయించి కోర్టులో కేసు వేయించారనే చర్చ శాఖలో జరుగుతోంది. ఇది ఇలా ఉండగా అత్యవసర సేవలు కాబట్టి ప్రత్యామ్నాయం ద్వారా పోషకాహారాన్ని పంపిణీ చేసే అవకాశమున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే మాట వినిపిస్తోంది. లబ్ధిదారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు సరఫరా చేసే వారి నుంచి సేకరించి అక్కడ నిర్దేశించిన ధరలకే పోషకాహారాన్ని అందించవచ్చు. కానీ ప్రభుత్వం స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
1.50 లక్షల మందిపై ప్రభావం..
వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్ల కింద 5 రకాల పోషకాహారాన్ని గర్భిణులు, బాలింతలకు అందిస్తున్నారు. రాగి పిండి, అటుకులు, బెల్లం, చిక్కీలు, ఎండు ఖర్జూరం సరఫరా చేయాలి. రాయలసీమ పరిధిలోని చిత్తూరు, అన్నమయ్య, వైయస్‌ఆర్, కర్నూలు జిల్లాల పరిధిలో జనవరి నెలకు కిట్లు ఇవ్వలేదు. ఈ జిల్లాల పరిధిలో 12 వేల వరకు అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. దాదాపుగా రూ.1.50 లక్షల మంది గర్భిణులు, బాలింతలు ఉండగా వీరికి పోషకాహారం సరఫరా చేయలేదు. ఎందుకు ఇవ్వలేదంటూ లబ్ధిదారులు అంగన్‌వాడీ కేంద్రాలను ఆశ్రయిస్తున్నా సమాధానం చెప్పేవారే లేరు.
source : eenadu.net
Discussion about this post