‘నవ్యాంధ్ర ప్రగతి, ప్రజా సంక్షేమం తెదేపా అధినేత చంద్రబాబుతోనే సాధ్యం.. ప్రభుత్వ పాలనా విధానాల్ని ప్రజలు నిశితంగా పరిశీలించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అనుభవజ్ఞులైన నారా చంద్రబాబునాయుడుకే పట్టం కట్టాలి’ అని ఆయన సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి కోరారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం ఆమె కాణిపాకం గణపతిని దర్శించుకొని, చిత్తూరు మీదుగా ముత్తుకూరు గ్రామానికి చేరుకున్నారు. నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక మృతి చెందిన మోహన్‌నాయుడు కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం కింద రూ.3 లక్షల చెక్కు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడుకు పార్టీ కార్యకర్తలే బలమని, వారే రథసారథులన్నారు. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు కార్యకర్తలే రోడ్లపైకి వచ్చి ఉద్యమించారన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను వైకాపా దేశంలోనే మాదక ద్రవ్యాలలో ప్రథమ స్థానంలో నిలబెట్టిందన్నారు.
ఓ వైపు గంజాయి, డ్రగ్స్‌తో యువత జీవితాలు నాశనమవుతుంటే మరోవైపు ఆడబిడ్డలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరుగుతున్నాయన్నారు. చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోందన్నారు. ఆడబిడ్డగా మీ కష్టాలు నాకు తెలుసన్నారు.
source : eenadu.net
Discussion about this post