టీడీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు జనం నీరాజనం పట్టారు. పార్టీ అభ్యర్థిత్వం ఖరారయ్యాక ఆయన గురువారం తొలిసారి పట్టణానికి వచ్చారు. అంతకు మునుపు అనంతపురం నుంచి వందలాది వాహనాలతో బయలుదేరి, పంపనూరులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సిబాయి గ్రామంలో ఆంజనేయ స్వామికి, గోళ్ల ఆంజనేయస్వామికి, అక్కమ్మగార్ల ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు. సురేంద్రబాబు వస్తున్నారన్న సమాచారంతో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు పట్టణానికి చేరుకున్నారు. టీ సర్కిల్‌లో బాణసంచా పేల్చి ఆయనను స్వాగతించారు. ఈ సందర్భంగా సురేంద్రబాబు మాట్లాడుతూ, కళ్యాణదుర్గం టీడీపీకి కంచుకోట అని, స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జీడిపల్లి, కుందుర్పి బ్రాంచ్ కెనాల్ పనులను పూర్తి చేస్తామని అన్నారు. నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న 114 చెరువులకు నీరు ఇచ్చే కలను సాకారం చేస్తానని హామీ ఇచ్చారు. కళ్యాణదుర్గం అన్ని రంగాలలో వెనుకబడిన ప్రాంతమని, ఈ ప్రాంతానికి రోడ్లు, సాగు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని అన్నారు. టమోటా ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పుతామని తెలిపారు. సైకోను పారదోలి ప్రజాపాలనను తీసుకొద్దామని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాలవారికి న్యాయం జరుగుతుందని అన్నారు.
source : andhrajyothi.com
Discussion about this post