‘‘అనంతపురం జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ. ఈ ప్రాంత అభివృద్ధికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృషి చేశారు. కియా ఫ్యాక్టరీని తీసుకొచ్చి 50 వేల మందికి ఉపాధి కల్పించారు’’ అని తెదేపా ;ప్రధాన కార్యదర్శి లోకేశ్ తెలిపారు. శంఖారావం కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన హిందూపురం, మడకశిర, పెనుకొండ నియోజక వర్గాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనంతలో రూ.840 కోట్లతో మేము మెగా డ్రిప్ ఇరిగేషన్ పథకం చేపట్టామన్నారు. జగన్ సీˆఎం అయ్యాక డ్రిప్ పథకాన్ని ఎత్తేశారని విమర్శించారు.
జగన్ అనంతపురం జిల్లాకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని లోకేశ్ ఆరోపించారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. తెదేపా హయాంలో 15 లక్షల ఎకరాల్లో వేరుసెనగ సాగయ్యేదని.. ఇప్పుడు 3 లక్షల ఎకరాలకు పడిపోయిందన్నారు. హంద్రీనీవా ఫేజ్-2 పూర్తి చేస్తానని చెప్పి ఐదేళ్లల్లో గంప మట్టి కూడా తీయలేదన్నారు. హెచ్చెల్సీ ఆధునికీకరణ పూర్తిచేస్తామని చెప్పి రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. తెదేపా హయాంలో ప్రారంభించిన జీడిపల్లి-పేరూరు ఎత్తిపోతల పథకానికి మళ్లీ శంకుస్థాపన చేసి పనులు చేయలేదన్నారు. మడకశిర బ్రాంచి కెనాల్ ద్వారా గోరంట్లకు సాగునీరు ఇస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపించారు.
మడకశిరలో వక్క మార్కెట్ ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు. హంద్రీనీవా కాలువల ద్వారా నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీరందిస్తామని, పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. ప్రతి మండలంలో డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తామని, తెదేపా హయాంలో మంజూరైన గురుకుల పాఠశాలలు అర్ధాంతరంగా ఆపేశారని వాటిని పూర్తి చేస్తామని, పట్టు రైతులకు రావాల్సిన రాయితీ సొమ్మును అందించే బాధ్యత తీసుకుంటామన్నారు. లేపాక్షి భూముల్ని వెనక్కి తీసుకుని పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. హిందూపురాన్ని మోడల్‌గా తీర్చిదిద్ది ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామన్నారు.
source : eenadu.net
Discussion about this post