తెదేపా హయాంలో తెచ్చిన ప్రాజెక్టులన్నింటిని వైకాపా నిర్వీర్యం చేసింది.. మళ్లీ అధికారంలోకి రాబోతున్నాం.. కరవు నేలను సస్యశ్యామలం చేస్తాం.. వలసలు నివారిస్తాం.. ‘‘ప్రజల మద్దతు కోసమే ప్రజాగళం. ఎన్నికల వేడి వచ్చేసింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటికి వెళ్లే రోజు దగ్గర్లోనే ఉంది. వైకాపాను ఓడించాలన్న కసి మీలో ఉంది. మీరు పడిన బాధలకు విముక్తి దొరుకుతుందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని తేరుబజార్‌లో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మిట్ట మధ్యాహ్నం వేళ జనం భారీగా తరలొచ్చారు.. సైకో పోవాలి.. సైకిల్ రావాలంటూ నినాదాలతో సభలో హుషారెత్తించారు. కర్నూలు జిల్లాకు తుంగభద్ర నీళ్లు తప్ప ఏ నీళ్లు రావు.. ఎల్లెల్సీ, గుండ్రేవుల, గురురాఘవేంద్ర ప్రాజెక్టులే శరణ్యం. తెదేపా ఈ ప్రాజెక్టులను నిర్మించేందుకు నిధులు విడుదల చేసి టెండర్లు పిలిచామని వైకాపా వాటన్నింటినీ నిర్వీర్యం చేసింది.పనులు లేకపోవడంతో ఈ ప్రాంతం నుంచి వలస వెళ్తున్నారు. మేము అధికారంలోకి రాగానే నీటి వనరుల ప్రాజెక్టులు పూర్తి చేసి దశదిశ మారుస్తాం. ఆర్డీఎస్ కుడి కాలువతోపాటు వేదవతి, వెలుగోడు, గుండ్రేవుల, గురురాఘవేంద్ర ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.
source : eenadu.net
Discussion about this post