‘‘కక్ష సాధింపుల వల్ల నేను రాజకీయాల నుంచి విరామం తీసుకుంటున్నాను. వివిధ పరిమితుల కారణంగా ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం చేయలేకపోతున్నాను. 14 ఏళ్ల వనవాసం ముగిసిన తర్వాత రాముడు తిరిగి వచ్చినట్లే, నేను నా పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయించగలిగినప్పుడు, ప్రజలకు అర్హుడినైన ప్రతినిధిగా ఉండగలిగినప్పుడు నేను మరింత బలంగా తిరిగి వస్తాను’’ అని గుంటూరు ఎంపీ, తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో సోమవారం మాట్లాడుతూ ఇదే తన చివరి ప్రసంగమని తెలిపారు. ఈ సందర్భంగా గత పదేళ్లలో దేశంలో, రాష్ట్రంలో జరిగిన వివిధ పరిణామాలను ప్రస్తావించారు.
‘‘రాజకీయ ప్రక్రియలో వ్యాపారం చాలా ముఖ్యమైన భాగం. ఆర్థికవ్యవస్థకు ఊతమిచ్చి, వృద్ధిని వేగవంతం చేయడంలో వ్యాపారుల పాత్ర కీలకం. వారు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలగాలి. ప్రతీకార భయం, వ్యాపారాలపై దాడులు చేస్తారన్న ఆలోచన లేకుండా మాట్లాడే వాతావరణం కల్పించాలి. రాజకీయ అభిప్రాయాలతో ఏకీభవించలేదన్న కారణంతో చట్టబద్ధంగా నడిచే వ్యాపార సంస్థలను వేధించే అవకాశం లేకుండా పార్లమెంటు రక్షణ కల్పించడం ముఖ్యం. పార్లమెంటు సభ్యుల అఫిడవిట్లను పరిశీలిస్తే అందులో 20% మంది తమకు వ్యాపారాలున్నట్లు ప్రకటించారు. గత పదేళ్లుగా నేను ఎదుర్కొంటున్న సమస్యలే వారికీ ఉన్నాయని నమ్ముతున్నా. ప్రభుత్వాలు నిర్ణయించే ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి వ్యాపారస్తులు చేయూతనందిస్తారు కాబట్టి అభివృద్ధి చెందిన దేశాల్లోని రాజకీయ, పరిపాలన వ్యవస్థలు వ్యాపారస్తులను ప్రోత్సహిస్తుంటాయి.
దురదృష్టవశాత్తు మన దేశంలో మాత్రం నిరంతరం ప్రతీకార భయం వెంటాడుతోంది. ఒక వ్యాపారానికి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి 70కి పైగా అనుమతులు తీసుకోవాలి. అధికారంలో ఉన్న పార్టీ… ఇందులోని ప్రతి వ్యవస్థనూ ఆయుధంగా ప్రయోగించడానికి వీలుంది. అది మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ నినాదాలకు గొడ్డలిపెట్టులా పనిచేస్తుంది. నేను రాజకీయాల నుంచి తప్పుకొంటున్నా నిద్రపోను. వ్యాపారవేత్తగా పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి ద్వారా రాష్ట్రానికి, దేశానికి సేవ చేస్తూనే ఉంటాను. మా గ్రూప్ 17వేల మందికి ఉద్యోగాలు కల్పించి, వారి కుటుంబసభ్యుల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తోంది’’ అని పేర్కొన్నారు.
ప్రత్యేక హోదా.. పోలవరం.. విభజన సమస్యలపై…
గల్లా జయదేవ్ తన ప్రసంగంలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టుతోపాటు, విభజన చట్టంలోని హామీల గురించి మాట్లాడారు. ‘‘రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు గురించి ప్రస్తావించడాన్ని స్వాగతిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని 13వ షెడ్యూలు ప్రకారం 11 సంస్థలు ఏర్పాటుచేయాలి. ఇక్కడ పోలవరం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు. తెదేపా అధికారం నుంచి వైదొలిగే 2019 నాటికి 75% పనులు పూర్తయ్యాయి. అయిదేళ్లు గడిచినా నాడు ఎక్కడున్నాయో అక్కడే ఉన్నాయి. రెండో సవరించిన అంచనా మొత్తం రూ.55,656 కోట్లకు ఆమోదముద్ర వేసి, నిర్దిష్ట గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని ఈ నా చివరి ప్రసంగం ద్వారా ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా.
source : eenadu.net
Discussion about this post