ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో మీ పేరుందా..? లేకపోతే వెంటనే నమోదు చేసుకోండి. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 15 వరకే గడువుంది. రాష్ట్రంలో మే 13న జరగనున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఇదే చివరి అవకాశం. దీన్ని చేజార్చుకుంటే ప్రజాస్వామ్యంలో వజ్రాయుధాన్ని కోల్పోయినట్లే. సాధారణంగా నామినేషన్ల గడువు చివరి రోజు వరకూ ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల పరిశీలన, నోటీసుల జారీ, దరఖాస్తుదారుల సమాధానాల కోసం కనీసం వారం గడువు ఇవ్వాలి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15 వరకే దరఖాస్తులకు అవకాశమిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా తెలిపారు. అప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ జాబితాలో చోటు కల్పిస్తామని వివరించారు. రాబోయేవి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన ఎన్నికలు. ఒక్క ఓటు తేడాతో గెలుపోటములు తారుమారైపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రతి ఓటూ కీలకమే. అందుకే ఓటు లేని వారు తక్షణమే నమోదు చేసుకోండి.
ఓటర్ల జాబితా నుంచి ఓట్ల తొలగింపునకు ఇక అవకాశం లేదు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు విడుదలైనందున ఓట్ల తొలగింపుపై ఎన్నికల సంఘం ఫ్రీజింగ్ పెట్టింది. శుక్రవారం వరకు వచ్చిన ఫాం-7 దరఖాస్తులనే పరిశీలించి ప్రాసెస్ చేస్తారు. ఆ ఓట్లు తొలగించాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోవాల్సిందే.
ఓటు నమోదుకు మార్గాలివి..
విధానం-1: www.nvsp.in వెబ్‌సైట్‌లో మీ ఫోన్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకుని లాగిన్ కావాలి. ‘రిజిస్టర్ యాజ్ ఏ న్యూ ఓటర్’ విభాగంపై క్లిక్ చేస్తే ‘ఫాం-6: అప్లికేషన్ ఫాం ఫర్ న్యూ ఓటర్స్’ అనే ఉప విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఆన్‌లైన్ దరఖాస్తు వస్తుంది. అందులో పేర్కొన్న వివరాలన్నీ నింపి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మీ ఫోన్ నంబర్‌కు రిఫరెన్స్ ఐడీ నంబరు వస్తుంది. దాని ఆధారంగా ఇదే వెబ్‌సైట్‌లో ఆ దరఖాస్తు ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులోని వివరాల ఆధారంగా బూత్ స్థాయి అధికారి మీ చిరునామాకు వచ్చి పరిశీలిస్తారు. అన్ని వివరాలూ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఓటరు జాబితాలో మీ పేరు చేరుస్తారు.
విధానం-2 : https://voterportal.eci.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి తొలుత మీ ఫోన్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాలి. లాగిన్ అయ్యి వెబ్‌సైట్‌లోకి ప్రవేశించిన వెంటనే ‘న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్’ అనే విభాగం ఉంటుంది. దానిపై క్లిక్ చేసుకుంటూ వెళ్లి.. దరఖాస్తులో అడిగిన వివరాలన్నీ నింపి సబ్మిట్ చేయొచ్చు.
విధానం-3 : ప్లే స్టోర్‌లో భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన VoterHelpline మొబైల్ యాప్ ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ నంబర్, వివరాలు పొందుపరిచి రిజిస్టర్ చేసుకోవాలి. వాటి ఆధారంగా లాగిన్ కావాలి. ‘ఓటరు రిజిస్ట్రేషన్’ విభాగంలోకి వెళితే ‘న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్’ వస్తుంది. దానిపై క్లిక్ చేసుకుంటూ వెళ్లి.. అందులో అడిగిన వివరాలన్నీ నింపి దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
విధానం-4 : https:/ceoandhra.nic.in వెబ్‌సైట్‌లో సైతం ఎన్‌వీఎస్‌పీ, ఓటర్ పోర్టల్ వెబ్‌సైట్ లింకుల్లోకి వెళ్లొచ్చు. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
source : eenadu.net
Discussion about this post