‘మనం వేసే ఓటుతో తలరాతలు మారతాయని జ్ఞాపకం ఉంచుకోండి. పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరిగే ఎన్నికలివి. మీ బిడ్డది పేదల పక్షం. జగన్‌కు ఓటేస్తే ఇప్పుడు జరిగే ప్రతి మంచీ కొనసాగుతుంది. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. పేదలంతా మోసపోతారు’ అని సీఎం జగన్ ప్రజలను హెచ్చరించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రముఖిగా మారతారని ఆరోపించారు. బాబుది బోగస్ రిపోర్టు అని, తమది ప్రోగ్రెస్ రిపోర్టు అంటూ వైకాపా ప్రభుత్వం అమలుచేసిన పథకాలను ఏకరువు పెట్టారు. బస్సు యాత్రలో భాగంగా బుధవారం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో జరిగిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ‘జాబు కావాలంటే బాబు రావాలని భ్రమ కల్పిస్తారు. 2014లోనూ ఇలాగే చెప్పారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో 32 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. నేను సీఎం అయ్యాక సచివాలయాలు తీసుకొచ్చి, 1.35 లక్షల ఉద్యోగాలిచ్చాను. మరి జాబ్ రావాలంటే ఎవరు కావాలి? ఫ్యాన్ కావాలా? తుప్పుపట్టిన సైకిల్ కావాలా?’ అని ప్రజలను ప్రశ్నించారు. తెదేపా నినాదమైన జాబు కావాలంటే బాబు రావాలనే నినాదాన్ని అనుకరిస్తూ ‘జాబు కావాలంటే.. జగన్ రావాలి’ అని వారిచేత చెప్పించి ఆనందించారు.
వాలంటీర్లకు తాను ఏం చేస్తారో మాటమాత్రంగానైనా ప్రస్తావించని జగన్.. అదే వాలంటీర్ల వేతనాలను రెట్టింపు చేస్తానన్న చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ‘వాలంటీర్లపై విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు రూ.10 వేలు ఇస్తానంటున్నారు. అంటే నా పాలనను పరోక్షంగా మెచ్చుకున్నట్లే. ఎన్డీయే కూటమి నేతలు వాలంటీర్ వ్యవస్థపై భయంకరమైన ద్వేషం వెళ్లగక్కారు. ఇప్పుడు మోసపూరిత మాటలు చెబుతున్నారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తారు. వారినే వాలంటీర్లను చేసి, దోచుకొమ్మని చెబుతారు. అదనంగా వారికే రూ.పది వేలు ఇస్తార’ని జగన్ ఆరోపించారు. చంద్రబాబు పాలనతో తన పాలనను పోల్చుతూ ఫ్యాక్ట్ చెక్ పేరుతో జగన్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు, ఆయన మనుషులు 30 ఏళ్లుగా అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. వివిధ వర్గాలకు తాను అమలుచేసిన సంక్షేమ పథకాలను వల్లె వేస్తూ, చంద్రబాబు ఏమి చేయలేదని వివరిస్తూ ప్రజలు ఆమోదం తెలపాలని కోరారు. సభలో ముందున్న వారినుంచి మాత్రమే స్పందన రాగా, పలుమార్లు ‘ఇలా ఇలా..’ అని చేయి చూపిస్తూ చేతులు ఊపాలని కోరారు.
source : eenadu.net
Discussion about this post