ఐదేళ్ల పాటూ కనీసం ఒక్క పనీ చేయకపోవడంతో ఊళ్లలో తిరగలేక పోతున్నామని పలువురు వైకాపా ఎంపీపీలు, సర్పంచులు స్పీకర్ తమ్మినేని సీతారాం ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో కొన్ని రోజులుగా సీతారాం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వైకాపా నాయకులు కొందరు ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సీతారాం సోమవారం తన కార్యాలయంలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ‘గ్రామాల్లో ప్రచారానికి వస్తే ఎవరూ రావట్లేదు. ఇలా ఉంటే మనం ఎలా గెలుస్తాం?’ అని వారిని సీతారాం ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. దానికి కొందరు నాయకులు బదులిస్తూ.. ‘ఐదేళ్లలో ఒక్క పనైనా చేశారా? మీ వెంట తిరుగుతున్నా మా గోడు విన్నారా? మా ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు రాలేదు. మిమ్మల్ని నమ్మి అప్పులు చేసి రోడ్డున పడ్డాం. మీ మాటలు నమ్మే పరిస్థితి లేదు’ అని చెప్పినట్లు తెలిసింది. సరుబుజ్జిలి మండలానికి చెందిన ఓ వైకాపా నాయకుడు తీవ్ర అసంతృప్తితో సమావేశానికి హాజరుకాలేదు.
source : eenadu.net
Discussion about this post