ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి.. మీరు ఎమ్మెల్యే పదవిలో ఉండి,… ఏడాదికి రూ.లక్షలు జీతం తీసుకుంటూ.. తప్పుడు ఆదాయం చూపి రేషన్‌కార్డు ఎలా తీసుకున్నారని ఆదోని తెదేపా మైనార్టీ నాయకుడు ఉమ్మి సలీం ప్రశ్నించారు. ఆదోని పట్టణంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఉమ్మి సలీం మాట్లాడుతూ.. 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైన సాయిప్రసాద్‌రెడ్డి.. ఆ తర్వాత 2005లో పింక్ రేషన్‌కార్డు తీసుకున్నారన్నారు. ఇందుకు గానూ ఆ రేషన్‌కార్డులో ఏడాదికి రూ.లక్ష వరకు ఆదాయం చూపించారన్నారు. ఎమ్మెల్యే పదవిలో ఉండి ఏడాదికి రూ.లక్షల్లో వేతనం తీసుకుంటుంటే తప్పుడు ఆదాయం చూపించి రేషన్‌కార్డు ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. తమది జమిందారుల వంశమని చెబుతున్న మీరు.. రేషన్‌కార్డు ఎందుకు తీసుకున్నారన్నారు. ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌తో పాటు.. ఇతర అవసరాల కోసం ఈ రేషన్ కార్డు వినియోగించారని గుర్తుచేశారు. సర్వే నంబరు 66లోని 36.05 ఎకరాల భూమిని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి తన ఇద్దరు పిల్లల పేరుపై గతంలో కొన్నారని.. ఇది అసైన్డ్‌భూమి అని నేను ప్రశ్నిస్తే.. కాదు పట్టా భూమి కొనుగోలు చేశామని ఎమ్మెల్యే పేర్కొంటున్నారని.. మరి పట్టా భూమి కొనుగోలు చేస్తే.. రెవెన్యూ అధికారుల నుంచి కన్వర్షన్ లెటర్ ఎందుకు తీసుకున్నారని, ఆ భూమిలో కళాశాల నిర్మాణం చేపడతామని చెప్పిన మీరు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. శ్మశానవాటికలో దహన సంస్కారాల కోసం ఏర్పాటు చేసే యంత్రంలో ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎందరినో బెదిరించి భూములు కబ్జా చేశారని ఆరోపించారు.
source : eenadu.net
Discussion about this post