ఎన్నికల ముందే ఎందుకు కులగణన చేపడుతున్నారు. ఈ ప్రక్రియ కారణాలు వివరిస్తూ ప్రభుత్వ గెజిట్ ఎందుకు విడుదల చేయలేదు? రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత గోప్యత, భద్రత, స్వేచ్ఛలను హరించడం కాదా? కులగణనే మీ ఉద్దేశమైతే ఉపకులం, ఆదాయం, భూ యాజమాన్య వివరాలు, కోళ్లు, మేకలు, ఆవులు, గేదెల వివరాలన్నీ ఎందుకు?’’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా సీఎం జగన్‌కు ఒక లేఖను పంపించారు. ఈ అభ్యంతరాలకు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. బిహార్ ప్రభుత్వం చేసిన కులగణనపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం ఉందని, దానిపై తీర్పు రాకముందే ప్రజాధనాన్ని ఎందుకు వృథా చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు. ‘‘జనగణన అనేది ఎంతో మంది నిపుణులతో చేయాల్సిన కార్యక్రమం. మీ వాలంటీర్లకు ఆ అర్హత, సామర్థ్యాలు ఉన్నాయని ఎలా నిర్ధారించారు? గతంలో కేంబ్రిడ్జి అనలిటిక ఇలాంటి గణన చేపట్టినప్పుడు సమాజంలో అశాంతిని సృష్టించిన విషయం మీకు తెలియదా? ఎన్నికల వేళ స్వీయ ప్రయోజనాలకు వాడుకునేందుకే ఇది చేస్తున్నారని మాకు తెలియదనుకుంటున్నారా?’’ అని జనసేన అధ్యక్షుడు ప్రశ్నించారు. ‘‘సేకరించిన డేటా దుర్వినియోగం కాకుండా తీసుకునే చర్యలేమిటి? ప్రజల నుంచి ఈ డేటాకు ఎలా సమ్మతి తీసుకుంటున్నారు? ప్రభుత్వ వనరులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని స్వీయ ప్రయోజనాలకు వాడుకోవడం రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడం కాదా? డేటా ఎలా భద్రపరుస్తారో తెలియజేస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని పవన్ డిమాండు చేశారు.
source : eenadu.net
Discussion about this post