తెలుగుదేశం, జనసేన పార్టీలను గుండెల్లో పెట్టుకుని కొలిచే గోదావరి నేలపై బుధవారం ఆ పార్టీలు ఎన్నికల శంఖారావం పూరించబోతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదికగా తొలి ఉమ్మడి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌కు చాలా ముందుగా ఏకంగా 99 మంది అభ్యర్థులను ప్రకటించి యుద్ధానికి సిద్ధమంటున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి ప్రచార బరిలోకి దిగుతున్నారు. రెండు పార్టీల క్యాడర్‌ను రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు కలిసి కదనరంగంలోకి దూకేలా సంసిద్ధం చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ సభలో ఉమ్మడి ‘జెండా’ ఎత్తబోతున్నారు. అందుకే ఈ సభకు ‘జెండా’ అనే పేరును నిర్ణయించారు. ఉత్తరాంధ్ర వేదికగా తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం ముగింపు సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సైతం పాల్గొన్నారు. అయినా తొలి ఉమ్మడి సభగా తాడేపల్లిగూడెం ‘జెండా’ సభనే పేర్కొంటున్నారు.
తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు, సీట్ల సంఖ్య ఖరారైన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇది. అందుకే జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంత అస్తవ్యస్తంగా తయారైంది, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని సరైన మార్గంలోకి తీసుకెళ్లేందుకు రాజకీయ పార్టీలుగా, రాష్ట్ర భవిష్యత్తును కాంక్షించే బాధ్యతాయుత నాయకులుగా పొత్తుతో ఎందుకు ముందుకెళుతున్నామో అటు తెదేపా, ఇటు జనసేన శ్రేణులకు ఈ సభలో స్పష్టంగా వివరించబోతున్నారు. రెండు పార్టీల శ్రేణుల మధ్య పొరపొచ్చాలు సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై గళమెత్తబోతున్నారు. కార్యకర్తలు ఎంత బాధ్యతాయుతంగా కలిసి కదనరంగంలోకి దూకాలో దిశానిర్దేశం చేయబోతున్నారు. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యసాధనలో పొత్తు ఎంత ప్రధానమో పవన్ కల్యాణ్ చెప్పబోతున్నారు. అధినేతల ప్రసంగాల్లో ‘ఓటు బదిలీ’ కీలకాంశం కానుంది. ఈ పొత్తు రాబోయే రోజుల్లోనూ రెండు పార్టీల క్యాడర్‌కు ప్రయోజనం కలిగిస్తుందని, జనసేన కార్యకర్తలకు అన్నింటిలోనూ అవకాశాలు లభించబోతున్నాయనీ స్పష్టం చేయనున్నారు. తెదేపా, జనసేన ప్రభుత్వంలోనూ సంక్షేమ పథకాలు ఉంటాయని, ప్రస్తుతం అందుతున్న ప్రయోజనాలకు మించిన సంక్షేమం ప్రజలకు అందించడంతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి పనులనూ పరుగులు పెట్టిస్తామని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు సంయుక్తంగా ప్రకటించబోతున్నారు. ఇప్పటికే రాజమహేంద్రవరం మహానాడులో తెదేపా ప్రకటించిన పథకాలతో పాటు జనసేన షణ్ముఖ వ్యూహంలోని సంక్షేమ పథకాలను కలిపి ప్రజలకు వివరించబోతున్నారు. తెదేపా – జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోని కొన్ని అంశాలను మరింత స్పష్టంగా తెలియజేయబోతున్నారు.
source : eenadu.net
Discussion about this post