త్రిసభ్య కమిటీ భేటీలో అంగీకరించిన రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు
ఏపీలోని 6, తెలంగాణలోని 9 అవుట్‌లెట్ల నిర్వహణ బాధ్యత కృష్ణాబోర్డుదే
విధివిధానాల సమీక్ష అనంతరం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు కృష్ణాబోర్డు ఆదీనంలోకి
ఏపీ తాగునీటి అవసరాలకు తక్షణం 2 టీఎంసీల విడుదలకు అంగీకరించిన త్రిసభ్య కమిటీ
కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కులను పోరాడి పరిరక్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో సీఎం వైఎస్ జగన్ విజయం సాధించారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణకు నాలుగున్నరేళ్లుగా ఆయన చేసిన పోరాటం, కృషి ఫలించాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ అంగీకరించింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ గతనెల 17న ఢిల్లీలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం అమలుకు గురువారం హైదరాబాద్‌లోని కృష్ణాబోర్డు కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశమైంది.
ఈ రెండు ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. అందుకు సంబంధించిన విధివిధానాలను ఈ సమావేశంలో రూపొందించారు. వాటిని కృష్ణాబోర్డు ఛైర్మన్ శివ్‌నందన్‌కుమార్ కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రాజెక్టుల అప్పగింత విధివిధానాలపై రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శులతో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి సమీక్షించనున్నారు. ఆ తర్వాత ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కృష్ణాబోర్డుకు అప్పగించనున్నారు.
source : sakshi.com
Discussion about this post