అది పైశాచికత్వానికి పరాకాష్ఠ..! వైకాపా నాయకుల వికృత మనస్తత్వానికి నిలువెత్తు నిదర్శనం..! విపక్ష నాయకులపై సీఎం జగన్‌లో అణువణువునా నిండిపోయిన అక్కసుకు అది సాక్ష్యం..! ఒక ప్రధాన రాజకీయపార్టీ సారథి, పైగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి..! కానీ జగన్ మాటల్లో, చేతల్లో ఆ హుందాతనం మచ్చుకైనా కనిపించడం లేదు. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ… ఆయన మనసులోని వికృత ఆలోచనలు మరింతగా బయటపడుతున్నాయి. విశాఖ జిల్లా సంగివలసలో వైకాపా శనివారం నిర్వహించిన సభే దీనికి నిదర్శనం. ఏ పార్టీ సభ జరిగినా… వాళ్ల నాయకుల కటౌట్లు పెట్టుకోవడం ఆనవాయితీ. విపక్ష పార్టీలు, నాయకులను విమర్శించడం సహజం. కానీ వైకాపా సభ వద్ద… ప్రతిపక్ష నాయకుల ఫొటోలతో కటౌట్లు పెట్టి, వాటికి బాక్సింగ్ బ్యాగ్‌లు కట్టి, సభకు వచ్చినవారిని పిడిగుద్దులు కురిపించాలని ప్రోత్సహించడం… విపరీత పోకడ కాకపోతే మరేంటి? ప్రభుత్వ ప్రజావ్యతిరేక, అస్తవ్యస్త నిర్ణయాలతో నష్టపోయిన వర్గాలవారు తమ నిరసనలో భాగంగా సీఎం, మంత్రుల దిష్టిబొమ్మలు తగలబెడితేనే… పోలీసులు కేసులు పెడుతున్నారే? మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలో, ప్రతిపక్ష నాయకుల బొమ్మలతో ఉన్న కటౌట్లు పెట్టి, వాటిపై సభకు వచ్చినవారితో పిడిగుద్దులు కురిపించడం విద్వేషాల్ని రెచ్చగొట్టడం కాదా? ఇలాంటి వాటిని పోలీసులు ఎలా అనుమతిస్తున్నారన్న ప్రశ్నలు విపక్ష పార్టీలు, విజ్ఞులు, మేధావుల నుంచి ఎదురవుతున్నాయి.
సామాజిక మాధ్యమాల్లో చురకలు
వైకాపా సభ వద్ద ఏర్పాటుచేసిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కటౌట్ల చిత్రాల్ని జగన్ వీరాభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి పైశాచికానందం పొందుతుండగా… దానిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ చురకలు వేస్తున్నారు.
source : eenadu.net
Discussion about this post