‘ఇక్కడొద్దు.. ఏమైనా మాట్లాడేది ఉంటే ఇంటికి రా అన్నా.. ఇక్కడ ఏం మాట్లాడుకున్నా అన్నీ బయటకు పోవడం, వాటిపైన చర్చలు ఇవన్నీ ఎందుకు?’ అని మంత్రులకు సీఎం జగన్ చెప్పారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఎజెండా అంశాలు పూర్తయ్యాక… సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడబోగా సీఎం కల్పించుకుని ‘ఇక్కడొద్దు ఇంటికి రండన్నా’ అంటూ వారించినట్లు తెలిసింది. సీఎం బయటకు వెళ్లిపోతుండగా ‘ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాలు సార్’ అంటూ కొందరు మంత్రులు ప్రస్తావించగా.. ‘విశాఖపట్నంలో ఇద్దామనుకున్నాం కదా, దానికోసం ఒక కమిటీని వేద్దామని కూడా అనుకున్నాం కదా’ అని సీఎం వ్యాఖ్యానించారు. సమావేశం కాస్త అటూఇటుగా గంటన్నరలోపే ముగిసింది. ఎజెండాలోని అంశాలకే పరిమితమయ్యారు. వాటిపై చర్చ సందర్భంగా మంత్రులు ఒకరిద్దరు తమ అభిప్రాయాలను చెప్పబోగా ముఖ్యమంత్రి వారించినట్లు తెలిసింది. ‘ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ఆమోదించేందుకు మళ్లీ సమావేశమవుతాం కదా, అప్పుడు మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం’ అని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఈ నెల 7న అసెంబ్లీలో ప్రభుత్వం ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుందని, ఆ రోజు ఉదయం మంత్రిమండలి సమావేశమై బడ్జెట్‌ను ఆమోదిస్తుందని మంత్రులు బయటకొచ్చాక చెప్పారు.
నియోజకవర్గాల వైకాపా సమన్వయకర్తల మార్పుల్లో భాగంగా సిటింగ్ స్థానాలను కోల్పోయిన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు గుమ్మనూరు జయరాం, గుడివాడ అమర్‌నాథ్ ఈ సమావేశానికి హాజరవడంతో కొంత ఆసక్తికర చర్చకు దారితీసింది. నారాయణస్వామిని చిత్తూరు లోక్‌సభ సమన్వయకర్తగా మార్చారు. జయరాంను కర్నూలు లోక్‌సభ సమన్వయకర్తగా మార్చారు. తర్వాత అక్కడ నుంచీ ఆయన్ను తప్పించారు. అప్పటినుంచి జయరాం ఎవరికీ అందుబాటులోకి రావట్లేదు. బుధవారం ఇతర మంత్రులు ఆయన్ను ఈ విషయమై కదిలించగా…‘నేను అండర్‌గ్రౌండ్‌కు వెళ్లా’ అని చెప్పినట్లు తెలిసింది.
source : eenadu.net
Discussion about this post