తెదేపా అధికారంలో ఉన్న సమయంలో అన్నపూర్ణగా వెలుగొందిన ఆంధ్రప్రదేశ్.. వైకాపా హయాంలో అరాచక ఆంధ్రప్రదేశ్‌గా మారిందని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ధ్వజమెత్తారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తెదేపా కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని.. భూములు, ఆస్తులు లాక్కుంటున్నారని మండిపడ్డారు. పుంగనూరు నియోజకవర్గంలో చాలామంది కార్యకర్తలను చంపేశారని ఆమె ఆరోపించారు. అయినా, కార్యకర్తలెవరూ ధైర్యం కోల్పోలేదని, పార్టీ జెండాను కింద పడనివ్వలేదని భువనేశ్వరి తెలిపారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడోరోజు భువనేశ్వరి గురువారం పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన వెంకటపతి నాయుడు, దొరస్వామి, జయప్రకాష్, గోవిందయ్య, సుజాతమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించి ధైర్యం చెప్పారు. ‘తన అరెస్టుతో మనస్తాపానికి గురై మరణించిన వారికి అండగా నిలవాలని చంద్రబాబు కోరారు. ఇంటింటికీ ఎలా తిరుగుతావని సన్నిహితులు, స్నేహితులు, కుటుంబసభ్యులు వారించారు. అందరినీ ఒకచోటకు పిలిచి చెక్కులు ఇస్తే సరిపోతుందని సలహా ఇచ్చినా.. మనసు ఒప్పుకోలేదు. నా బిడ్డలైన కార్యకర్తల కుటుంబాలు బాధలో ఉన్నప్పుడు నేనే నేరుగా వెళ్లి ధైర్యం చెప్పాలని నిర్ణయించుకున్నా’ అని భువనేశ్వరి స్పష్టం చేశారు.
‘గంజాయి, మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాల్లో సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో నంబరు- 1గా నిలిపారు. చంద్రబాబు అరెస్టు సందర్భంగా మహిళలు నిరసనకు దిగితే జైళ్లలో నిర్బంధించారు. రాజధానిగా అమరావతే ఉండాలని నినదిస్తే మహిళల దుస్తులు చెదిరిపోతున్నా చూడకుండా పోలీసులు బలవంతంగా బస్సుల్లోకి ఎక్కించారు. ఓ గర్భిణి పొట్టపై తన్నితే బిడ్డ చనిపోయింది. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా వచ్చే ఎన్నికల్లో పోరాడి గెలవాలి’ అని భువనేశ్వరి పిలుపునిచ్చారు.
source : eenadu.net
Discussion about this post