అరాచక వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపి.. అభివృద్ధికి పేరుగాంచిన తెదేపాను గెలిపించుకుందామని తెదేపా కళ్యాణదుర్గం ఎమ్యెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, పార్టీ అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కుందుర్పిలో శుక్రవారం సాయంత్రం వారు ఎన్నికల ప్రచార రోడ్‌షో నిర్వహించారు. వారికి నాయకులు, కార్యకర్తలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. వైకాపా పాలనలో సామాన్యులు, బలహీన వర్గాలపై దాడులు, దౌర్జన్యాలు చేశారని ఆరోపించారు. తెదేపా హయాంలో చంద్రబాబు చేసిన అభివృద్ధిని వైకాపా వారు అస్తవ్యస్తం చేశారని దుయ్యబట్టారు. అరాచక సీఎం జగన్ రాజకీయ అజ్ఞానంతో రాష్ట్రాన్ని మూడు రాజధానుల పేరుతో.. చివరకు రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు సురేంద్రబాబు తెలిపారు. నియోజకవర్గంలో ఆగిపోయిన అన్ని అభివృద్ధిపనులను ఏడాదిలోనే పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
source : eenadu.net
Discussion about this post