జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం, పేదలకు సంపూర్ణ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యమని కలెక్టర్ గౌతమి పేర్కొన్నారు. శుక్రవారం అనంత పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలను ఘనంగా జరిపారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన తర్వాత.. ఎస్పీ అన్బురాజన్ , జేసీ కేతన్ గార్గ్ లతో కలిసి సాయుధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. 14 రకాల సామాజిక పింఛన్లను అందిస్తున్నామని, ఆసరా కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు నాలుగు విడతల్లో రూ.948.37 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. రీసర్వే చేపట్టి..61,425 మంది రైతులకు భూ హక్కు పత్రాలు ఇచ్చామన్నారు. జడ్పీ ఛైర్ పర్సన్ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, నగర మేయర్ వసీం, ఉప మేయర్లు వాసంతి, విజయ్ భాస్కర్ రెడ్డి, నగర కమిషనర్ మేఘ స్వరూప్ , జడ్పీ సీఈఓ నిదియాదేవి, డీఆర్ ఓ గాయత్రీదేవి పాల్గొన్నారు.
విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆరు పాఠశాలలకు చెందిన విద్యార్థులు దేశభక్తి గీతాలకు నృత్యం ప్రదర్శించారు. ఇందులో యాటకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ‘నింగి, వంగి.. నేల పొంగి’ అంటూ ఉర్రూతలూగించారు. గార్లదిన్నె, కూడేరు కేజీబీవీ విద్యార్థులు, విశ్వభారతి పాఠశాల విద్యార్థుల చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
source : eenadu.net
Discussion about this post