ప్రభుత్వం తాను అనుకున్నట్టుగానే కొద్దిమందికి మినహా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పింఛన్ల పంపిణీకి నిర్ణయించింది. 86.33 శాతం పింఛనుదార్లు గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చి పింఛన్లు తీసుకునేలా ఉత్తర్వులిచ్చింది. పింఛన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సరిపోరని.. వీరిలో కొందరికి వేర్వేరు విధులు ఉన్నాయని.. ఇలా పలు కారణాలు చూపించి చివరకు పింఛనర్లను గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పించేలా చేస్తోంది. ఈ మేరకు బుధవారం నుంచి ఆరో తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్లను ఇవ్వాలంటూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో మంచానికి, వీల్‌ఛైర్‌కు పరిమితమైనవారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందే వృద్ధ వితంతువులకు మాత్రమే ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేయాలని ఉత్తర్వులో పేర్కొంది. పింఛన్ల పంపిణీపై గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) సీఈవో గతనెల 31న జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించి.. దాని స్థానంలో ఈ నెలతోపాటు మే, జూన్ నెలల్లోనూ సచివాలయాల్లో పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలిచ్చింది. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేపట్టరాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఈ సర్క్యులర్ జారీ చేసినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ పేర్కొన్నారు.
source : eenadu.net
Discussion about this post