ఎవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి భరోసానిచ్చారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రెండో రోజు పర్యటించారు. తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందిన అయిదు కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. కందుకూరు నియోజకవర్గం గుడ్లూరుకు చెందిన తెదేపా కార్యకర్త కర్పూరపు సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. తర్వాత అదే గ్రామానికి చెందిన పువ్వాడి చిన్నవెంకయ్య కుటుంబసభ్యులను ఓదార్చారు. అక్కడినుంచి గుడ్లూరు మండలం దారకానిపాడులోని దగ్గుమాటి వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం కొమ్మి గ్రామానికి చెందిన తాటిపర్తి సుధాకర్ కుటుంబసభ్యులను ఓదార్చారు. నెల్లూరు రూరల్ పరిధిలో తెదేపా కార్యకర్తలు రేగల వెంకయ్య, పూల సుబ్బారావు కుటుంబాలను పరామర్శించారు. గురువారం రాత్రి ఆమె నెల్లూరులోనే బస చేయనున్నారు.
source : eenadu.net
Discussion about this post