వైఎస్సార్‌సీపీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎం.వీరాంజనేయులును నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపిక చేస్తూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. మంగళవారం అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మావతి మీడియాతో మాట్లాడారు. వీరాంజనేయులు ఒక సామాన్య కుటుంబానికి చెందిన వారన్నారు. ఆయన తండ్రి వెంకటప్ప గత ప్రభుత్వ హయాంలో సర్పంచ్‌గా పనిచేశారని, టీడీపీ నాయకులు ఇబ్బందులకు గురి చేసినా వైఎస్సార్‌సీపీ పటిష్టతకు, పంచాయతీ అభివృద్ధికి పాటుపడ్డారన్నారు. తమ్ముడి లాంటి వీరాంజనేయులుకు తమ కుటుంబం అండగా ఉంటుందన్నారు. టికెట్ వస్తే ఒకలా.. రాకుంటే మరోలా ఉండే స్వభావం తనది కాదన్నారు. పార్టీ నిర్ణయాలకు లోబడే తాను ముందుకెళ్తున్నట్లు చెప్పారు. పేదలకు చేస్తున్న మేలులో భాగస్వాములు కావాలన్నదే తమకు ముఖ్యమన్నారు. వైఎస్సార్‌సీపీ విజయానికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు. జగనన్న సీఎంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. గత పాలకులు శింగనమల అభివృద్ధిని విస్మరించారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో శింగనమల చెరువు లోకలైజేషన్, నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పాలన బడుగు, బలహీనవర్గాలకు స్వర్ణయుగం లాంటిదని పార్టీ శింగనమల సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు అభివర్ణించారు. సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు సమన్వయకర్తగా అవకాశం కల్పించడం వరంగా భావిస్తున్నానన్నారు. అణగారిన వర్గాలను ఉన్నతస్థాయిలో చూడాలన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కలలను సీఎం జగన్ మోహన్‌రెడ్డి సాకారం చేస్తున్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఆర్థిక ప్రగతి సాధించేలా విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ప్రభుత్వ విద్యా సలహాదారుడు ఆలూరు సాంబశివారెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణ, పార్టీ కోశాధికారి ఎం.శ్రీనివాసులు నాయక్, నాయకులు నరేంద్ర, వజ్రం గంగరాజు, నాగేంద్ర పాల్గొన్నారు.
జగనన్నే మళ్లీ ముఖ్యమంత్రి కావాలి
వైఎస్సార్‌సీపీ విజయానికి శాయశక్తులా కృషి
మీడియాతో శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
source : sakshi.com
Discussion about this post